మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వివరాలు


 


జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (NREGA) 2005, ఆగస్టు 25న ఆమోదం పొందింది. 2005, సెప్టెంబర్ 7న దానిని నోటిఫై చేయడం జరిగింది. ఆ చట్టాన్ని 2006, ఫిబ్రవరి నుంచి 200 జిల్లాలలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రారంభించారు. 2007లో మరో 170 జిల్లాలలో దానిని అమలు చేయడం ప్రారంభించారు. 2008 ఏప్రిల్ లో NREGAను పూర్తిగా పట్టణ జనాభా కలిగిన జిల్లాలు తప్పించి దేశంలోని అన్ని జిల్లాలలో అమలు చేయడం ప్రారంభమైంది. NREGAను 2009, అక్టోబర్ 2 నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)గా పిలవడం ప్రారంభించారు.


భారత ప్రభుత్వం చేపడుతున్న అతిపెద్ద ప్రతిష్టాత్మక పథకంగా MGNREGS పేరు పొందింది. ఈ పథకన్ని దేశవ్యాప్తంగా 613 జిల్లాలలోని 6349 బ్లాక్ లు/మండలాల్లోని 2.38 లక్షల గ్రామ పంచాయితీలలో అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 28.49 కోట్ల మంది కూలీల వద్ద 13.19 కోట్ల జాబ్ కార్డులున్నాయి. ఈ పథకం కింద ఉపాధి పొందుతున్న వారిలో 19.18% మంది ఎస్సీలు, 14.96 % మంది ఎస్టీలు ఉన్నారు. 2013-14 కాలంలో ఈ పథకం క్రింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 46 వ్యక్తి-పనిదినాలు, ప్రతీ వ్యక్తికీ రోజుకు 133 రూపాయల సగటు వేతనం వంతున చెల్లించారు.


భారత ప్రభుత్వం పాత పథకాలను, కొత్త పథకాలను కలిపి గ్రామీణ ప్రజలకు అదనపు ఉద్యోగ భద్రతను కల్పిస్తుంది. దీని ద్వారా గ్రామాలలోని ప్రజలు శారీరకశ్రమతో కూడిన పనుల ద్వారా వారు వారి సంపదలను సుస్థితరం చేసుకోవడం మరియు ఆహార భద్రతను మెరుగు పరచుకుంటున్నారు. నిర్వహణ వైఫల్యాలు, ప్రణాళిక రూపకల్పన, వాటి అమలులో లోపాలు ఈ పథకంలోని ప్రధాన లోపాలు. ఈ పథకాలన్నిటిలో ఇచ్చే ప్రతిఫలం – ఆహారధాన్యాలతో కూడిన వేతనం. దీనికి మూడు దశాబ్దాల ముందు చేపట్టిన జవహర్ రోజ్ గార్ యోజన, ఉపాధి హామీ పథకం, పనికి ఆహార పథకం, జవహర గ్రామ సమృద్ధి యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన తదితర ప్రయోగాత్మక పథకాల ద్వారా ప్రభుత్వం చివరికి ఈ పథకానికి రూపకల్పన చేసిందని చెప్పవచ్చు.


ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం 100 పనిదినాలు కల్పించి వారికి జీవనోపాధి భద్రత కల్పించడం MGNREGS పథకం యొక్క ప్రధాన లక్ష్యం.


Download APPLICATION FOR MGNREGS New Job Card ( Fresh Application )


లక్ష్యాలు


బలహీన వర్గాలకు ఇతర ఉపాధి అవకాశాలు, ప్రత్యామ్నాయ అవకాశాలు లేనపుడు లేదా తగినన్ని ఉపాధి అవకాశాలు లేనపుడు వారికి ఒక బలమైన సామాజిక భద్రతను కల్పించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది.

వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ సుస్థిర అభివృద్దికి ఒక చోదకశక్తిగా పని చేస్తుంది. కరువు, అటవీక్షయం, భూక్షయం తదితర కారణాల వల్ల ఏర్పడే కాలక్రమానుగత పేదరికాన్ని తగ్గించడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నా, గ్రామీణ జీవనోపాధులకు ఆధారమైన సహజవనరులను పెంచడానికి, గ్రామీణ ప్రాంతాలలో కలకాలం నిలిచి ఉండే సంపద సృష్టి కొరకు కూడా ఈ పథకాన్ని ఉపయోగించు కుంటున్నారు. MGNREGSని సమర్థంగా అమలు చేస్తే, అది దేశంలో పేదరికం ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయగలదు.

చట్టబద్ధమైన హక్కు ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి సాధికారతను కల్పించడం.

పారదర్శకత, క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యం అన్న పాలనా సంస్కరణ నియమాల ద్వారా కొత్త పద్దతిలో పాలనా నిర్వహణ.


ముఖ్యాంశాలు:


  • స్థానిక గ్రామ పంచాయితీలో నైపుణ్యం అవసరం లేని పని చేయడానికి గ్రామీణ కుటుంబాలలోని వయోజనులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి.
  • వారి వివరాలు నిర్థారించుకున్న అనంతరం గ్రామ పంచాయతీ ఈ ఉపాధి కోరుతున్న వారి దరఖాస్తులను, దానికి అనుబంధంగా జత చేసిన రేషన్ కార్డు, ఫొటోలాంటి ఇతర పత్రాలను పరిశీలించి అర్హులుగా భావించిన వారిని మండల/బ్లాక్ అధికారులకు పంపుతుంది. అక్కడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO/బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి (BDO) MGNREGSకు ప్రాజెక్టుకు అధికారిగా వ్యవహరిస్తున్న అధికారి వారికి జాబ్ కార్డులు జారీ చేస్తారు.
  • గ్రామ పంచాయతీ దరఖాస్తుదారులకు జాబ్ కార్డులు జారీ చేస్తుంది.
  • జాబ్ కార్డ్ లభించిన వారు గ్రామ పంచాయితీకి రాతపూర్వకంగా తమకు పని కావాలని కోరవచ్చు. వీరికి కనీసం 14 రోజుల పాటూ ఉపాధి కల్పించాల్సి ఉంటుంది.
  • జాబ్ కార్డ్ వారు ఇచ్చిన దరఖస్తు తమకు అందినట్లు గ్రామ పంచాయతీ తేదీతో కూడిన రసీదు ఇస్తుంది.
  • దరఖాస్తు అందుకున్న 15 రోజులలోగా గ్రామ పంచాయితీ వారికి ఉపాధి కల్పించాలి. లేనట్లైతే గ్రామ పంచాయతీ వారికి నిరుద్యోగ భృతి చెల్లించాలి.
  • గ్రామానికి చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో గ్రామ పంచాయతీ పని చూపించాలి. 5 కి.మీ. పరిధిలో పని చుపించలేనట్లైతే అయా జాబ్ కార్డ్ ఉన్నవారికి గ్రామపంచాయతీ రవాణా ఛార్జీలు, ఇతర ఖర్చుల నిమిత్తం పది శాతం అదనంగా చెల్లించాలి.
  • కేంద్రం మరో వేతన రేటును నిర్థారించేంతవరకూ రాష్ట్రంలోని వ్యవసాయ కూలీలకు కనీస వేతన చట్టం, 1948 ఆధారంగా వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఇది రోజుకు రూ. 60కన్నా తక్కువ ఉండడానికి వీల్లేదు. మహిళలకు, పురుషులకు సమాన వేతనాన్ని చెల్లించాలి.
  • వేతనాన్ని పీస్ రేటు ప్రకారంగా లేదా దినసరి కూలీగానైన చెల్లించాలి. వేతనాలను వారం ప్రాతిపదికగా చెల్లించాలి. వేతనాలు ఇవ్వడంలో ఎట్టి పరిస్థితిలోనూ రెండు వారాలకు మించి జాప్యం జరగరాదు.
  • పని కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లలో కనీసం మూడోవంతు మంది మహిళలు ఉండాలి.
  • పని చేసే ప్రదేశంలో పిల్లల కోసం క్రష్, త్రాగునీరు, షెడ్ లు ఏర్పాటు చేయాలి.
  • గ్రామంలో చేపట్టాల్సిన పనుల గురించి గ్రామపంచాయతీ ప్రతిపాదిస్తుంది. దానిని మండల పరిషత్, జిల్లా పరిషత్ లు ఆమోదిస్తాయి.
  • కనీసం 50% పనుల నిర్వహణను గ్రామపంచాయతీలకు అప్పగిస్తారు.
  • ఈ పథకం కింద ప్రధానంగా నీరు, భూసార పరిరక్షణ, అటవీకరణ, భూమి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చు.
  • వేతనాలు, నిర్మాణ పదార్థాలను 60:40లో ఉండాలి. ఈ కార్యక్రమాల కింద యంత్రాలను, కాంట్రాక్టర్లను అనుమతించరు.
  • నైపుణ్యాలు అవసరం లేని మానవ శ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం 100% వేతనం ఖర్చులు భరిస్తుంది. నైపుణ్యాల కూలీలకు మెటీరియల్ రేటుతో కలిపి 75% భరిస్తుంది.
  • గ్రామసభ సామాజిక తనిఖీలను నిర్వహించాలి.
  • సమస్యలను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆయా కార్యక్రమాల అమలును సక్రమంగా నిర్వహించేలా జాగ్రత్త వహించాలి.
  • ఈ పథకం కింద చేపట్టే అన్ని రికార్డులు, అకౌంట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.


MGNREGS బడ్జెట్: 


భారత ప్రభుత్వం 2014-15లో ఈ పథకానికి రూ. 34,000 కోట్లను కేటాయించింది. 2013-14లో దీనికి


రూ.33,000 కోట్లను కేటాయించారు. 2012-13లో రూ.40,000 కోట్లను, 2011-12లో రూ.40,000 కోట్లను, 2010-11లో


రూ.40,100 కోట్లను కేటాయించారు. 2006-09 మధ్య కాలంలో ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు రూ.10,000 కోట్ల నుంచి


రూ.15,000 కోట్లకు మాత్రమే పెరిగాయి.


భాగస్వాములు:


కూలీలు: గ్రామీణ ప్రాంతంలో ఈ పథకం కింద కూలీలే ప్రధాన భాగస్వాములు. కూలీల హక్కులు:


  • రిజిస్ట్రేషన్ కొరకు దరఖస్తు
  • జాబ్ కార్డును పొందడం
  • పని కొరకు దరఖాస్తు
  • దరఖాస్తు చేసుకున్న పని విషయంలో సమయం, కాలం ఎంపిక చేసుకొనే సదుపాయం
  • దరఖాస్తు చేసుకొన్న 15 రోజుల్లోగా పనిని పొందడం
  • పని ప్రదేశంలో క్రెష్, తాగునీరు, ప్రథమ చికిత్స సదుపాయాలు కలిగి ఉండడం
  • పని చేసే ప్రదేశం గ్రామం నుంచి 5 కి.మీ. పరిధికి పైబడి ఉంటే, 10శాతం ఎక్కువ వేతనం పొందే హక్కు
  • తాము చేసిన పని, దానిని హాజతు పట్టికలో నమోదు చేశారా అన్న వివరాలు పరిశీలించి తెలుసుకునే హక్కు
  • పని చేసేన 15 రోజులలోగా వేతనాన్ని పొందే హక్కు
  • దరఖాస్తు చేసుకొన్న 15 రోజులలోగా పనిని పొందలేని పక్షంలో విరుద్యోగ భృతి పొందే హక్కు
  • పని చేసే సమయంలో దెబ్బలు తగిలితే వైద్యం ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు, అంగవైకల్యం లేదా మృతి చెందినట్లైతే దానికి నష్టపరిహారం చెల్లింపు


గ్రామసభ

ఈ పథకం కింద గ్రామసభకు ఈ క్రింది హక్కులు, భాధ్యతలు అప్పగించడం జరిగింది:


  • గ్రామసభ MGNREGS కింద ప్రతిపాదించిన పనులను చేపట్టాలి.
  • ఈ పథకం అమలైన తర్వాత గ్రామ సభ సామాజిక తనిఖీ నిర్వహిస్తుంది.
  • ఈ పథకం గురించి గ్రామసభ విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది.

గ్రామ పంచాయతీ:


గ్రామస్థాయిలో ఓ పథకం నిర్వహణకు గ్రామపంచాయితీయే కీలకం.


గ్రామ పంచాయతీ బాధ్యతలు:


  • ఆయా పనుల ప్రణాళికలు
  • రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తుల స్వీకరణ
  • రిజిస్ట్రేషన్ దరఖాస్తులను పరిశీలించడం
  • ఆయా కుటుంబాలను నమోదు చేసుకోవడం
  • జాబ్ కార్డులు అందజేయడం
  • ఉపాధి కొరకు దరఖాస్తుల స్వీకరణ
  • దరఖాస్తులు స్వీకరించిన 15 రోజుల్లోగా ఉపాధి కల్పన
  • పనుల నిర్వహణ
  • రికార్డుల నిర్వహణ
  • సామాజిక తనిఖీ కోసం గ్రామసభల ఏర్పాటు
  • గ్రామస్థాయిలో పథకం నిర్వహణ, పర్యవేక్షణ

బ్లాక్/మండల/జిల్లాస్థాయి: 

బ్లాక్/మండల స్థాయిలో ప్రణాళికల నిర్వహణ/పర్యవేక్షణకు మధ్యంతర వారధిగా పంచాయితీ బాధ్యత వహిస్తుంది. బడ్జెట్ ను జిల్లాస్థాయి పంచాయతీ లేదా జిల్లా నీటి నిర్వహణ సంస్థ (DWMA) ఆమోదించి, జిల్లాస్థాయిలో దానిని సమన్వయం చేయాలి.


రిజిస్ట్రేషన్, ఉపాధికి అర్హత: 


MGNREGS కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన అన్ని గ్రామీణ ప్రాంతాలలోని కుటుంబాలు నమోదు చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పనిదినాలు అన్న నియమం ఒక కుటుంబానికి వర్తిస్తుంది.


దరఖాస్తు చేసుకున్న కుటుంబ సభ్యులంతా పని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదు చేసుకోవడానికి వారు:


  • స్థానికంగా నివసిస్తూ ఉండాలి. స్థానికత అంటే, గ్రామపంచాయతీ పరిధిలో నివసిస్తుండాలి. కొంతకాలం పాటూ వలస వెళ్లి తిరిగి వచ్చి ఊండవచ్చు.
  • నైపుణ్యం లేని పని చేయడానికి సిద్ధపడిన వాళ్లై ఊండాలి.
  • స్థానిక గ్రామ పంచాయతీలో ఒక కుటుంబంగా నమోదు చేసుకొని ఉండాలి.

గ్రామంలోని కుటుంబానికి చెందిన వయోజనులు నైపుణ్యం లేని శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాతపూర్వకంగా కానీ, మౌఖికంగా కానీ స్థానిక గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవచ్చు.


జాబ్ కార్డులు


  • నమోదు చేసుకొన్న ప్రతి కుటుంబానికీ గ్రామ పంచాయతీ జాబ్ కార్డులు అందజేస్తుంది.
  • స్థానికంగా నివసిస్తున్నట్లు, వారి వయోజనులని (ఇ పథకం కింద నమోదు చేసుకోవడానికి వయోజనులు మాత్రమే అర్హులు) ధృవపరచుకున్న అనంతరం కుటుంబం ఆధారంగా జాబ్ కార్డు జారీ చేస్తారు.
  • ఉపాధి కోరడానికి జాబ్ కార్డు ప్రాతిపదికగా ఉంటుంది. ప్రతి జాబ్ కార్డుకూ ఒక ప్రత్యేకమైన సంఖ్యను కేటాయిస్తారు. గ్రామపంచాయితీ/ మండల/బ్లాక్ స్థాయిలో ఉపాధిని జాబ్ కార్డు ఆధారంగానే కేటాయిస్తారు. పని చేపట్టిన అనంతరం జాబ్ కార్డులో ఎప్పటికప్పుడు ఎన్ని రోజులు పని చేసింది, ఎంత వేతనం చెల్లించింది తదితర వివరాలు నమోదు చేయగలిగేలా ఉండాలి.

పని కొరకు దరఖాస్తు

సాదారణంగా పని కొరకు దరఖాస్తును గ్రామ పంచాయితీకి సమర్పించాలి. దరఖాస్తును రాతపూర్వకంగా ఇవ్వాలి. దానిలో ఈ క్రింద వివరాలుండాలి:


  • జాబ్ కార్డు రిజిస్ట్రేషన్ సంఖ్య
  • ఆ జాబ్ కార్డు ఏ రోజు నుంచి చెల్లుబాటు అవుతుంది.
  • ఎన్ని రోజులు ఉపాధి కావాలి.

గ్రామ పంచాయితీ లేదా బ్లాక్/మండల కార్యాలయానికి పనిని కోరూతూ ఒక దరఖాస్తును సమర్పించాలి. దానిలో ఎన్ని రోజులు పని కావాలి, ఏ సమయంలో కావాలి అన్న వివరాలు ఉండాలి. గ్రామ పంచాయతీ తీసుకున్న దరఖాస్తుకు రసీదును అందజేస్తుంది. దాని ఆధారంగా 15 రోజుల్లోగా వారికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది.


అమలు చేసే సంస్థలు:


ఈ పథకం కింద అందజేసే నిధులు 50 శాతం గ్రామపంచాయతీలే నిర్వహించాలి అని ఈ చట్టం నిర్దేశిస్తున్నందున పథకం అమలులో గ్రామ పంచాయతీయే ముఖ్యమైన సంస్థ.


మండల/బ్లాక్ మధ్యస్థ మరియు జిల్లా పంచాయత్/జిల్లా పరిషత్లతో పాటు – ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రధాన వాటా కలిగిన సహకార సొసైటీలు, మంచి పేరు కలిగిన ప్రతిష్టాత్మక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పథకం అమలులో భాగస్వామ్యం పంచుకోవచ్చు. స్వయం సహాయక బృందాలను కూడా దీని కోసం పరిశీలన చేయవచ్చు.


చేపట్టదగిన పనులు:


గ్రామీణ ప్రాంతాలలో కనీస ఉపాధి అవకాశాలు సృష్టించడం MGNREGS యొక్క ప్రధాన ఉద్దేశం.


ఏ రకమైన పనులు చేపట్టవచ్చునో ఈ చట్టంలోని మొదటి షెడ్యూల్ ప్రకారం – MGNREGS ఈ క్రింది పనులపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది.


  • జల సంరక్షణ, జల పరిరక్షణ
  • కరువు రాకుండా చేపట్టే పనులు, వీటి కింద సూక్ష్మ, చిన్న తరహా నీటి పారుదల పనులు వస్తాయి
  • నీటిపారుదల కాలువలు – వీటిలో సూక్ష్మ, చిన్న తరహా నీటి పారుదల పనులు వస్తాయి
  • నీటిపారుదల సౌకర్యాల కల్పన, చెట్లు నాటడం, ఉద్యానవన తోటల పెంపకం, ఎస్సీఎస్టీలకు చెందిన భూమిని అభివృద్ధి చేయడం, భూసంస్కరణ లబ్ధిదారులు లేదా ఇందిరా ఆవాస్ యోజన/BPL కుటుంబాలకు చెందిన భూముల అభివృద్ధి
  • సాప్రదాయ నీటి నిలువ ప్రదేశాలు, చెరువుల్లో మట్టి పూడిక తొలగింపు; భూమి అభివృద్ధి
  • వరదల నియంత్రణ, రక్షణ పనులు, నీరు నిలువ ఉన్న ప్రదేశాల నుంచి నీటి తొలగింపు కార్యక్రమాలు
  • అన్ని కాలాలలో చేరుకొనేలా గ్రామాలకు రహదారుల నిర్మాణం. రోడ్ల నిర్మాణంలో అవసరమైతే కల్వర్టుల నిర్మాణం, గ్రామ ప్రాంతంలో డ్రెయిన్ ల నిర్మాణం కూడా చేపట్టవచ్చు. PMGY కింద చేపట్టిన రహదారుల నిర్మాణం MGNREGS కింద చేపట్టకుండా జాగ్రత్త వహించాలి.
  • MGNREGS కింద సిమెంటు రోడ్లు, కాంక్రీట్ రోడ్ల నిర్మాణం చేపట్టరాదు. ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రదేశాలకు రహదారుల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి.
  • రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన పనినైనా చేపట్టవచ్చు.
  • ఈ పథకం కింద సృష్టించిన సంపద (అటవీ ప్రాంతాల పరిరక్షణతో పాటు) నిర్వహణ కూడా MGNREGS కింద అనుమతించిన పనుల కిందకు వస్తాయి. ఇదే షరతు ఇతర పథకాల కింద సృష్టించబడిన సంపదలకు కూడా వర్తిస్తాయి కానీ అవి ఈ చట్టంలోని షెడ్యూల్-1 కింద అనుమతించబడిన రంగాలకు చెందినవై ఉండాలి.
  • MGNREGS వనరులను భూసేకరణ కోసం ఉపయోగించకూడదు. చిన్న, సన్నకారు రైతులు లేదా ఎస్సీ/ఎస్టీలకు చెందిన భూములను ఈ పథకం కింద సేకరించడం కానీ, విరాళంగా ఇవ్వడం కానీ చేయరాదు.

పనులను అనుమతించడం:


  • నిర్వహణ, సాంకేతిక అనుమతులను అధికార యంత్రాంగం వాటి అమలుకు ముందు ఏడాదిలోనే అంటే డిసెంబర్ లోగా పొందాల్సి ఉంటుంది.
  • ఒకసాతి ఉపాధి కోసం డిమాండ్ ఏర్పడిన తర్వాత అధికార యంత్రాంగం, సాంకేతిక అనుమతులు పొందిన పనుల జాబితా నుంచి పనులను కేటాయిస్తారు.
  • సాధారణంగా పనులను ప్రారంభించడానికి, పనుల కోసం దరఖాస్తు చేసుకొన్న వారికి పనులు కేటాయించడానికి గ్రాప పంచాయతీలే తగిన అధికార సంస్థలు (వర్క్ ఆర్డర్లు జారీ చేయడం ద్వారా).
  • ప్రోగ్రామ్ ఆఫీసర్ (PO) కు పనుల కొరకు విజ్ఞప్తులు అందితే లేదా గ్రామ పంచాయతీ ద్వారా విజ్ఞప్తి అందితే ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా వర్క్ ఆర్డర్ల ద్వారా అనుమతులు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు.

పనుల కొలత:


చేసిన పనులను కొలత వేయడానికి రాష్ట్రాలు తమ స్వంత నియమాలను రూపొందించుకోవచ్చు. సంపద, పనిని అంచనా వేయడంలో ఈ క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి:


  • MGNREGS కింద చేపట్టే పనులను స్పష్టంగ గుర్తించాలి మరియు దానిలో ఎలాంటి కనిపించని అంశాలు ఉండకూడదు. ముక్కలుగా చేసిన పని (పీస్ రేట్)లో ఎలాంటి తక్కువ వేతన చెల్లింపులు ఉండరాదు. వివిధ రకల పనులను కలపడం/ఒకే పనిగా గుర్తించడం (ఉదా: గుంటలు తవ్వడం/మట్టిని తవ్వి పోయడం) లాంటి వాటిని నివారించాలి.

  • పీస్-రేట్ పనుల జాబితా కింద నమోదు చేయబడిన పనులన్నింటిలో నేల స్వభావం, వాలు, భూమి స్వభావంలాంటి వివిధ స్థానిక అంశాలను పరిగణలోనికి తీసుకుని, సాధారణంగా ఆ పనిని పూర్తి చేయడానికి పడే కాలానికి అనుగుణంగా అన్ని ప్రాంతాల వారు సమానమైన వేతనాన్ని పొందేట్లు ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తి నిబంధనలను నిర్ణయించాలి.

  • అవినీతి, తక్కువ చెల్లింపు సమస్యలను అరికట్టడానికి పని చేసిన సమయం, కొలతలు తీసుకున్న సమయానికి మధ్య ఉన్న విరామం, కొలతపరమైన నిబంధనలు (వ్యక్తిగత/సమిష్టి) రూపొందించుకోవాలి.


పని ప్రదేశంలో సౌకర్యాలు:


పనుల అమలును పర్యవేక్షించే సంస్థలు పని ప్రదేశంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. వైద్యపరమైన సంరక్షణ, తాగు నీరు, నీడ వసతులు, ఆరేళ్లకన్నా తక్కువ వయసున్న పిల్లలు ఐదుమందికన్నా ఎక్కువ ఉంటే ఆ పిల్లలకు క్రేష్ వసతి కల్పించాలి.


ఆరేళ్లకన్నా తక్కువ వయసున్న పిల్లలు ఐదుమందికన్నా ఎక్కువ ఉంటే వారిని చూసుకోవడానికి MGNREGS కింద ఒక వ్యక్తిని, వారు మహిళ అయి ఉంటే మంచిది, ఏర్పాటు చేయాలి. ఆమెకు నైపుణ్యంలేని వ్యక్తితో సమానమైన వేతనాన్ని చెల్లించాలి. ఈ ఖర్చును ప్రత్యేకంగా నమోదు చేయాలి. దానిని పని కొలతలో భాగంగా చేర్చరాదు.


క్రెష్ ఉండే ప్రదేశాన్ని సమర్థంగా ఉపయోగించుకొనేలా తీర్చిదిద్దాలి. సాధారణంగా, ఒక పని ప్రదేశానిని లేదా కొన్ని పని ప్రదేశాలకు కలిపి ఒక క్రెష్ ను ఏర్పాటు చేయాలి.


వేతనాల చెల్లింపు:


  • మహిళలు, పురుషులిద్దరికీ సమానమైన పనికి సమాన వేతనం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం పని చేసే సమయంలో కూలీలకు వేతనల్లో కొంత భాగాన్ని రోజువారీగా చెల్లించే ఏర్పాటు చేయవచ్చు.
  • ప్రతి గ్రామ పంచాయతీలో ముందుగా నిర్ణీతమైన రోజున వారం ప్రాతిపదికగా వేతనాలు చెల్లించడం మంచిదని భావించబడుతోంది. బ్యాంకులు/పోస్ట్ ఆఫీసుల ద్వారా చెల్లించిన వేతనాల వివరాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి.
  • వేతనాలు సమయానికి అందేలా ఏర్పాటు చేయాలి. కూలీలకు వారం ప్రాతిపదికగా వేతనాల చెల్లింపు జరగాలి. వేతనాల చెల్లింపులో ఎట్టి పరిస్థితిల్లోనూ పని పూర్తయిన రెండు వారాలకు మించి జాప్యం జరగరాదు.
  • వేతనాలను పీస్ రేట్ ప్రకారం, ముందుగా నిర్ణయించిన రేటు ప్రకారం చెల్లించాలి.


నిరుద్యోగ భృతి: 

దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా పనిని కల్పించలేకపోయినట్లైతే, దరఖాస్తుదారులకు నిరుద్యోగ భృతి చెల్లించాలి. మొదటి 30 రోజులకు వేతన రేటులో మూడో భాగం, ఆ తర్వాత సగం వేతనం వంతున చెల్లించాలి.


పని కల్పన: 

పని కేటాయింపు సందర్భంగా, ఈ క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి: గ్రామానికి చుట్టుప్రక్కల 5 కిలోమీటర్ల పరిధిలో పనిని చూపించాలి. 5 కిలోమీటర్లు పైబడినట్లైతే రవాణా చార్జీలు, ఇతర ఖర్చుల నిమిత్తం పది శాతం అదనపు వేతనాన్ని చెల్లించాలి.


మహిళలకు ప్రాధాన్యతనివ్వాలి. ఈపథకం కింద ఉపాధి కల్పించేవారిలో కనీసం మూడో వంతు మంది మహిళలు ఉండాలి. ఖర్చుపరంగా, పనుల్లో 50 శాతం ఖర్చు చేసే అధికారాన్ని గ్రామ పంచాయితీలకు కట్టబెట్టాలి.


ప్రణాళిక: 

ప్రణాళికలు, ఎలాంటి పనులు చేపట్టాలి, ఏ పనిని ముందు, ఏ పనిని తర్వాత చేపట్టాలి, ఏ ప్రాంతంలో మొదట పనిని చేపట్టాలి – ఇలాంటి నిర్ణయాలు ఆ ఆర్థిక సంవత్సరంలో చేసుకోవాలి. ఈ నిర్ణయాలను గ్రామసభ సమావేశాల్లో తీసుకోవాలి. గ్రామ పంచాయతీ వాటికి ఆమోదం తెలపాలి. బ్లాక్, జిల్లాస్థాయిలో ప్రతిపాదించిన పనులకు అధికార యంత్రాంగం ఆమోదం తెలిపే ముందు గ్రామ సభ వాటిని ఆమోదించాలి. గ్రామ సభ వాటిని ఆమోదించవచ్చు, సవరణలు చేయవచ్చు లేదా వాటిని నిరాకరించవచ్చు.


ఖర్చుల వాటా: 

నైపుణ్యం అవసరం లేని కూలీల విషయంలో భారత ప్రభుత్వం 100 శాతం ఖర్చును భరిస్తుంది. నిర్మాణ పదార్థాల ఖర్చుతోపాటు నైపుణ్యాలు, అర్థనైపుణ్యాలు కలిగిన కూలీల ఖర్చులో 75 శాతం ఖర్చును భరిస్తుంది.


పని ప్రదేశం నిర్వహణ: ఈ పథకం కింద కూలీలు ప్రత్యక్ష లబ్ది పొందేలా, పనుల్లో యంత్రాల వాడకాన్ని, కాంట్రాక్టర్ల జోక్యాన్ని నిషేధించారు. ఈ చట్టం నీరు కారకుండా ఉండేందుకు, వేతన ఉపాధిపై ప్రధానంగా దృష్టి సారించేందుకు MGNREGS ఒక గ్రామ


పంచాయతీలో చేపట్టిన మొత్తం ఖర్చుల్లో వేతన ఖర్చు, నిర్మాణ పదార్థాల ఖర్చు 60 : 40 శాతంగా ఉండాలని ఈ చట్టం నిర్థేశిస్తోంది. పని ప్రదేశంలో క్రెష్, తాగు నీరు, నీడ వసతి కల్పించాలని కూడా ఈ చట్టం చెబుతోంది.


గిరిజన ప్రాంతాలలో MGNREGS :


గిరిజన వ్యవహారాల శాఖ MGNREGS కింద గిరిజన కుటుంబాలకు కేటాయించే పనిదినాల సంఖ్యను పెంచాలని ఒక ప్రతిపాదన తెచ్చింది. ఈ ప్రతిపాదనలను అనుసరించి భారత ప్రభుత్వం 2014, జనవరి 7న గిరిజన ప్రాంతాలలో షెడ్యూల్ తెగల కుటుంబాలకు పని దినాలను 100 నుంచి 150 కు పెంచింది. 50 రోజుల అదనపు పని దినాలకు అయ్యే ఖర్చును గిరిజన శాఖ నుంచి చెల్లిస్తారు.


చాలా రాష్ట్రాలు వికలాంగులకు కూడా తగిన పనుల రూపకల్పన చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న 80 శాతం వికలాంగులకు ఈ పథకం మంచి అవకాశం.


పారదర్శకత మరియు జవాబుదారీతనము:


సామాజిక తనిఖీ ద్వారా ఈ పథకంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నెలకొల్పారు. ఈ పథకం కింద చేపట్టే అన్ని పనులనూ, రికార్డులను గ్రామసభ తనిఖీ చేస్తుంది.


పథకాన్ని బాధ్యతాయుతంగా అమలు చేయడం కోసం సమస్య పరిష్కార వ్యవస్థ మరియు నిబంధనలను రూపొందించారు. ఈ పథకానికి సంబంధించిన అన్ని రికార్డులు, లెక్కలను ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు. కూలీల గురించి, పని వివరాల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పై అధికారులకు పంపేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయి సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు కూడా అందజేసింది. ఈ మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న MGNREGS పనులపై రోజువారీ సమాచారాన్ని తెలుసుకోగలుగుతుంది.


సామాజిక తనిఖీ:


ప్రతి మండలం/బ్లాక్ లో ప్రతి ఆరునెలలకోసారి సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. దీనిలో హాజరు పట్టికలను, చేపట్టిన అన్ని పనులనూ తనిఖీ చేస్తారు. గ్రామ సభ, మండలస్థాయి సమావేశాల్లో ఈ సామాజిక తనిఖీ నివేదికలను చదివి వివిపిస్తారు. క్రమపద్ధతిలో, క్రమం తప్పని, భహుళ వ్యవస్థ సామజిక తనిఖీ వల్ల ఈ పథకం అమలులో పౌరసమాజం పాత్ర పెరిగింది. అనేక రకాల మోసాలు, ఒకరి జాబ్ కార్డుపై మరొకరు పని చేయడం లాంటి బినామీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చి, వాటిపై చర్య తీసుకోవడం జరిగింది. సామాజిక తనిఖీ యొక్క ప్రాథమిక లక్ష్యం – వివిధ కార్యక్రమాలు, చట్టాలు, విధానాలను సమర్థంగా అమలులో జవాబుదారీతనం ఉండేలా చూడటం.


సామాజిక తనిఖీ అనేది లబ్ధిదారులు, ఇతర భాగస్వాములు – ప్రణాళిక రూపకల్పన నుంచి, దాని అమలు, పర్యవేక్షణ, మదింపు వరకూ ప్రాజెక్టు ప్రతి దశలో పాల్గొంటూ నిరంతరం నిర్వహించే ప్రక్రియగా పేర్కొనవచ్చు. దీని వల్ల ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వివిధ కార్యక్రమాలు రూపొందించుకోవడం, అమలు చేయడం సాధ్యపడుతుంది. దాని వల్ల ప్రభావితులయ్యే వారి ప్రాధాన్యతలను ప్రతిఫలిస్తుంది. తద్వారా ఎక్కువ మందికి మేలు జరుగుతుంది.


సామాజిక తనిఖీ అనేది ఒక నిరంతర ప్రకియ. సామాజిక తనిఖీలో వివిధ కార్యక్రమాల అమలులో 11 దశలలో ప్రజలు నిఘా, పరిశీలన చేసుకోవచ్చు.


  • కుటుంబాల నమోదు
  • వివిధ కార్యక్రమాల జాబితా రూపకల్పన, పని ప్రదేశాల ఎంపిక
  • సాంకేతిక అంచనా తయారీ, ఆమోదం, వర్క్ ఆర్డర్ జారీ చేయడం
  • దరఖాస్తుదారులకు పని కేటాయింపు
  • పనుల అమలు, హాజరు పట్టీల నిర్వహణ
  • వేతనాల పంపిణీ
  • పని మదింపు
  • నిరుద్యోగ భృతి చెల్లింపు
  • గ్రామసభలో సామాజిక తనిఖీ తప్పనిసరి చేయడం (సామాజిక తనిఖీ ఫోరమ్)

MGNREGSప్రభావం:


భారతదేశంలోని గ్రామీణ కుటుంబాలలో MGNREGS చెప్పుకోదగిన ప్రభావాన్నే కనబైచింది. దీని వల్ల వ్యవసాయ కూలీ రేట్లు పెరగడం, వలస వెళ్లడం తగ్గింది. గ్రామీణ కుటుంబాల ఆదాయం పెరిగింది. ఉపాధి కల్పనావాకాశాలు పెరిగి మహీళా సాధికారత పెరిగింది. దేశవ్యాప్తంగా MGNREGS కారణంగా గ్రామీణ ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లబ్ధి పొందుతున్నారు.


వలసల్లో తగ్గుదల:


పేదరికానికి పలసలు ప్రత్యక్ష నిదర్శనాలు. ఆర్థిక అభివృద్ధి లేదా ఇతర అవకాశాల కొరకు జరిగే వలసలు కాకుండా దుర్భర పరిస్థితుల కారణంగా వలస వెళ్లాల్సిన పరిస్థితుల్లో MGNREGS ఒక మేలైన, ప్రత్యక్ష మార్పును తీసుకురాగలిగింది. ఇంటికి దగ్గరలోనే గౌరవప్రదమైన ఉపాధిఉ కల్పన కారణంగా MGNREGS వలసల సంఖ్యను భారీగా తగ్గించగలిగింది.


ఏడాది పొడవునా ఎలాంటి పని దొరకని పరిస్థితులున్న చోట వలసలు సర్వసాధారణం. గతంలో ఇలాంటి వలసలను నివారించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాటి వల్ల చెప్పుకోదగిన ప్రభావం కనిపించలేదు. MGNREGS కింద పేద కుటుంబాలకు పనిలేని కాలంలో వంద రోజుల పనిదినాలను కల్పించడం జరుగుతోంది. తప్పనిసరి వలసలు ఉన్న గ్రామీణ ప్రాంతాలలో MGNREGS కారణంగా అలాంటి వలసలు తగ్గుముఖం పట్టాయి.


కూలీల రేట్ల పెంపు:


పని తక్కువగా ఉన్న కాలాల్లో గ్రామీణులకు ఉపాధి కల్పించడం ద్వారా MGNREGS వారికి ఆదాయ భద్రత కల్పించింది. మొదట్లో గ్రామాల్లో ఇచ్చే వేతనాలకన్నా MGNREGS కింద ఇచ్చే వేతనాలు ఎక్కువగా ఉండేవి. MGNREGS వేతనాలతో పాటు ఇతర వేతనాల రేట్లలో మార్పులు, ఒక కుటుంబానికి లభించే కూలీ దినాల సంఖ్యలో పెరుగుదల కారణంగా కుటుంబాల ఆదయం పెరిగి, వారి జీవనస్థాయి పెరిగింది.


జీవనోపాధి అవకాశాలు, ఆదాయాల్లో మార్పులు:


పేద కుటుంబాలకు బహుళ జీవనోపాధులుంటాయి. ఆయితే వారికి ఏడాది మొత్తం వేతనాలు అందించే జీవనోపాధి అవకాశాలు అవసరం.


అలాంటి క్రమం తప్పని జీవనోపాధులను పేదలు చాలా సందర్భాల్లో పొందలేకపోతున్నారు. దీని వల్ల వారు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూ, పనులు లేని కాలాల్లో ఇతర ప్రాంతాలకు వలస లేదా కుటుంబం గడవడం కోసం ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవడం జరుగుతోంది. MGNREGS పథకం రాకతో ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.


సామాజిక సాధికారత:


ఇతర పనులకన్నా మహిళలు ఈ పథకంలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. MGNREGS పథకం అమలవుతున్న తర్వాత గతంలో ఉపాధి లేకుండా లేదా తక్కవ వేతనాలు పొందుతున్న మహిళలకు చాలా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశోధనలు చేబుతున్నాయి. సాంప్రదాయపరంగా ఉండే లైంగిక వివక్షను MGNREGS కొంత వరకూ తగ్గించగలిగింది – మరీ ప్రత్యేకించి ప్రభుత్వ పనుల రంగంలో, ప్రస్తుతం MGNREGS కింద మహిళలకూ, పురుషులకూ సమాన వేతనాలు అందుతున్నాయి. MGNREGS తెచ్చిన ప్రధానమైన మార్పులు:


  • పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపు
  • వ్యవసాయ అభివృద్ధి
  • ఆహార భద్రత
  • ఇళ్ల నిర్మాణం
  • గ్రామీణ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరగడం
  • నాణ్యమైన ఆరోగ్య సేవలు పొందడం
  • అప్పుల ఊభిలోంచి బయటపడడం
  • పశువుల కొనుగోలు
  • సంపద సృష్టి
  • మరింత పొదుపు చేసే అవకాశం

సలహాలు/సూచనలు:


ఒక కుటుంబ పరిమాణం ఆధారంగా పని దినాలను నిర్ణయించాలి. కుటుంబంలోని చేతనైన వయోజనునికి ప్రతి సభ్యునికీ ఖచ్చితంగా ఏడాదికి కనీసం 100 పనిదినాలను కల్పించాలి.

MGNREGSను చేతివృత్తుల వారికీ, ఇతర వ్యవసాయేతర పనులకూ కూడా వర్తింపజేయాలి. ఈ పథకం కింద ఆయా ఉత్పత్తుల తయారీకి/సేవలకు కూడా వేతనాన్ని చెల్లించే ఏర్పాటు చేయాలి.

ఉమ్మడి/బంజరు భూములు, మౌలిక సదుపాయాలు, ఎస్సీ/ఎస్టీలకు చెందిన భూములే కాకుండా ఈ పథకాన్ని ఇతర పనులకూ విస్తరించాలి. MGNREGS కింద చిన్న, సన్నకారు రైతులకు చెందిన భూముల అభివృద్ధితో పాటూ వ్యవసాయం/ఉద్యానవన తోటల పెంపకం/ సేంద్రీయ వ్యవసాయ కార్యకలాపాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలి. దీని వల్ల ఆహార భద్రత సమకూరుతుంది.

గ్రామ పంచాయతీలు స్థానిక ప్రజల్లో MGNREGS పై అవగాహన పెంచాలి. కూలీలలో MGNREGSకు చెందిన హక్కులపై చైతన్యం తీసుకురావాలి. ఆ చట్టంలో ఉన్న సదుపాయాలు, విధానాలపై ప్రజల్లో అవగాహనాలోపం కారణంగా అధికారులు సమర్థంగా పని చేయడం లేదని తేలింది.

తాగు నీరు, పల్లలకు క్రెష్, ప్రధమ చికిత్సలాంటి వాటిని కేవలం కాగితంపై పెట్టినంత మాత్రాన సరిపోదు. వాటిని ఖచ్చితంగా అమలు చేసినపుడే ఈ పథకం లక్ష్యం నెరవేరుతుంది.

ఉమ్మడి బ్యాంక్ అకౌంట్లు ఏర్పాటు చేస్తే, మహిళలు అవసరమైనప్పుడు నగదును డ్రా చేసుకోగలుగుతారు.

ముగింపు:


MGNREGS కారణంగా ఉపాధి అవకాశాలు, వేతనాలు పెరిగి, ఉమ్మడి వనరులు, వ్యక్తిగత వనరుల మెరుగుపడి, గ్రామాల్లోని పేద కుటుంబాల ఆదాయం, పనులు, ఆహారభద్రత, జీవన ప్రమాణాలు వంటి వాటి విషయంలో అనేక మార్పులు తీసుకురాగలిగింది.


గ్రామీణ కుటుంబాలలో ఈ పథకం అనేక ముఖ్యమైన మార్పులు తెచ్చింది. పని దినాలను పెంచడం ద్వారా ఈ పథకం వారి జీవన ప్రమాణాలు పెంచగలదు, మహిళల భాగస్వామ్యాన్ని పెంచగలదు, స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయగలదు, వికలాంగులు, ఒంటరి మహిళలు లాంటి వారికి సరైన పని కల్పించగలదు, చిన్న రైతుల భూమిని అభివృద్ధి చేయగలదు, చేతివృత్తుల వారిని ఆదుకోగలదు.


ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు మరీ ప్రత్యేకించి ఆర్థికంగా, సామాజికంగా వెనికబడిన వారిలో అనేక ముఖ్యమైన మార్పులు తీసుకురాగలిగినప్పటికీ, సమాజంలో ఈ పథకం ద్వారా ఇంకా అనేక మార్పులు తీసుకురావచ్చు. ఉపాధి కూలీలు తమ హక్కును ఉపయోగించుకునే స్థితికి, ఈ పథకం అమలులో పారదర్శకత ఉండేలా చూసే స్థితికి చేరుకోలేదు.


MGNREGS లాంటి పథకాలతో గ్రామీణ ప్రజలకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించడమనే ప్రజాస్వామ్యయుతమైన దృఢవిశ్వాసం ద్వారా భారతదేశం తన ప్రాధాన్యతలను పునర్మూల్యాంకనం చేసుకోవచ్చు.




(SOURCE :: vikaspedia)







INCOMING SEARCHES


ఉపాధి హామీ జాబ్ కార్డు అనేది ఎలా పొందాలి

మీ జాబ్ కార్డ్ నంబరు తెలుసుకొనుటకు

NREGA జాబ్ కార్డ్ జాబితాలో పేరును check చేయండి

ఆన్లైన్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల వివరాలు

Post a Comment

0 Comments